Mumbai : ఈదురుగాలుల ధాటికి కూలిన భారీ హోర్డింగ్.. 14 మంది మృతి!
ముంబయిలో ఈదురు గాలులు, భారీ వర్షాల ధాటికి పెద్ద హోర్డింగ్ ఒకటి విరిగి పడింది. ఈ ఘటనలో పెద్ద జననష్టమే జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains In Mumbai : మహారాష్ట్ర రాజధాని నగరం ముంబయిలో(MUMBAI) సోమవారం సాయంత్రం భారీగా ఈదురు గాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆ గాలుల తాకిడికి అక్కడి ఘాట్కోపర్ (GHATKOPAR) ప్రాంతంలో పెద్ద హోర్డింగ్(HOARDING) ఒకటి విరిగిపోయి జనాలపై పడింది. దీంతో ఏకంగా పద్నాలుగు మంది మృతి చెందారు. మరో 70 మందికి పైగా గాయాలయ్యాయి. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది.
ఈ విషయమై మంగళవారం స్థానిక అధికారులు వివరాలను వెల్లడించారు. ముంబయిలోని(Mumbai) ములుంద్, మహిమ్, కుర్లా, దాదర్, విఖ్రోలి, దక్షిణ ముంబయి తదితర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయన్నారు. దీంతో అక్కడున్న హోర్డింగ్ విరిగి పక్కన ఉన్న పెట్రోల్ బంకుపై పడిందని తెలిపారు. దాని కింద వంద మంది వరకు చిక్కుకున్నారని తెలిపారు. దీంతో వారిని వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు.
ఇప్పటి వరకు 14 మంది మరణించినట్లు సమాచారం ఉందని తెలిపారు. హోర్డింగ్ శిధిలాల కింద మరో 20, 30 మంది వరకు ఉండి ఉండొచ్చని అన్నారు. గ్యాస్కటర్లతో హోర్డింగ్ని కొద్ది కొద్దిగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. భారీ క్రేన్ల సహాయంతో క్షతగాత్రులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అంబులెన్సులు సిద్ధంగా ఉండి గాయపడిన వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సైతం స్పందించారు. క్షతగాత్రులను వీలైనంత తొందరగా రక్షించడమే తమకు ముఖ్యమన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల నష్ట పరిహారం ప్రకటించారు.
#WATCH | Maharashtra | 35 people reported injured after a hoarding fell at the Police Ground Petrol Pump, Eastern Express Highway, Pantnagar, Ghatkopar East. Search and rescue is in process: BMC