Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, విపక్షాల మధ్య విమర్శలతో హీటెక్కాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాంపల్లిలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రిమోట్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. బీజేపీ విజయానికి మజ్లిస్ కారణం అని కాంగ్రెస్ చెబుతోందని.. అందులో నిజం లేదన్నారు. బీజేపీ విజయానికి తమకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా సహకరించి ఉంటుందని ఆరోపించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ ఆరెస్సెస్‌తో ప్రారంభమైందని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గుర్తుచేశారు. అందుకే గాంధీ భవన్ రిమోట్ భగవత్ చేతిలో ఉందని మరోసారి అన్నారు. తమపై ఎవరెన్నీ ఆరోపణలు చేసినా అందులో నిజం లేదన్నారు. బీజేపీపై తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు.
ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులు సత్తా చాటుతారని అసద్ అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్‌లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామని వివరించారు. అజారుద్దీన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏడు స్థానాల్లో 7 చోట్ల విజయం సాధిస్తామని అసద్ ధీమా వ్యక్తం చేశారు.