Whatsapp: ప్రస్తుతం డీప్‌ఫేక్‌ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ డీప్‌ఫేస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు వాట్సాప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపింది. ఈమేరకు మిస్ ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్‌తో భాగస్వామ్యం అవుతున్నట్లు వెల్లడించింది. అయితే ఇది మార్చి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ తెలిపింది.
ఈ హెల్ప్‌లైన్ సాయంతో ఎమ్సీఏ, దాని అనుబంధ స్వతంత్ర ఫ్యాక్ట్-చెకర్లు, పరిశోధన సంస్థలు వైరలవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తిస్తాయని మెటా తెలిపింది. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సాప్ చాట్‌బాట్‌ను సంప్రదించి ప్రజలు డీప్‌ఫేక్‌లపై సమాచారం తెలుసుకోవచ్చని తెలిపింది. హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే మెసేజ్‌ల నిర్వహణ కోసం ఎంసీఏ ప్రత్యేకంగా డీప్‌ఫేక్ అనాలసిస్ యూనిట్ నెలకొల్పుతుందని తెలిపింది. తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే వాట్సాప్ హెల్ప్‌లైన్ ముఖ్య ఉద్దేశమని మెటా తెలిపింది.