Supreme Court: ఉత్తరాఖండ్‌లో ఓ మహిళ 2006లో జరిగిన రోడ్డుప్రమాదంలో కన్నుమూసింది. అయితే మృతురాలి కుటుంబానికి రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని మోటారు ప్రమాద క్లెయిముల ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ పరిహారం సరిపోదని మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి హైకోర్టు.. గృహిణి కాబట్టి అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించలేమని తెలిపింది. కనీస జాతీయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని నిర్ధారిస్తుంటారని చెప్పింది. దీంతో మృతురాలి కుటుంబం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ నిర్వహించి.. తీర్పు వెలువరించారు.
హైకోర్టు వ్యాఖ్యలతో అందులో విభేదించింది. కుటుంబంలో కొందరి ఆదాయం పైకి కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం. ఆమె ఇంట్లో ఉండి చేసే పనులు ఎవరికీ కనిపించవు. ఇంట్లో చేసే పనులను ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తే.. ఆమె సేవలు చాలా విలువైనవి. వాస్తవానికి ఆమె సేవలను డబ్బు రూపంలో కొలవడం కష్టమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోజుకూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మృతురాలి కుటుంబానికి ఆరు వారాల్లోగా రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది.