టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా సమయంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ.. ఈ ఏడాది కూడా గొప్ప నటుల్ని పోగొట్టుకుంది. ఇటీవల రెబల్ ప్టార్ కృష్ణం రాజు మరణించగా..
రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్.. ఆ విషాదం నుంచి కోలుకోకుండానే మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని, దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ… ఈ
రోజు మదన్ తుది శ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన విద్య పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలకు పని చేసిన తర్వాత..
సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ మకాం మార్చారు. ఆ తర్వాత ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న మదన్ ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరగా 2018లో మోహన్ బాబు, మంచు విష్ణు నటించిన ‘గాయత్రి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక మదన్ మరణ వార్తపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.