టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
ఇప్పటికే బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు అందించగా.. వాటిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. బీఎల్ సంతోష్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సిట్ నోటీసులపై స్టే విధించింది.
హైకోర్టులో సంతోష్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేదని ప్రకాష్ రెడ్డి.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు ఆయనను నిందితుల జాబితాలో ఎలా చేర్చుతారని వాధించారు. అయితే.. బీఎల్ సంతోష్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అడ్వకేట్ జనరల్ ప్రస్తావించారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ పాత్రపై పక్కా ఆధారాలున్నాయని ఏజీ తెలిపారు. కాగా.. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.