YS Jagan promise: వైసీపీలో వర్గపోరు, వసంతకు జగన్ ‘పాతికేళ్ల’ హామీ
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(vasantha krishna prasad), మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి. జోగి తీరుపై వసంత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన అసంతృప్తులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేత రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేను పిలిపించుకొని దాదాపు అరగంట పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుండి ప్రాతనిథ్యం వహిస్తున్న జోగి తన పెడన నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టించుకోకుండా తన మైలవరం నియోజకవర్గంలో విబేధాలు ప్రోత్సహిస్తున్నారని అధినేత దృష్టికి తీసుకు వచ్చారని తెలుస్తోంది. మంత్రి స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేను అయిన తనను ఇబ్బంది పెడితే ఎలా అని ప్రశ్నించారని సమాచారం. స్పందించిన జగన్… నియోజకవర్గం పైన దృష్టి సారించాలని, ఇక అలాంటి సమస్య ఉండదని హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఏదైనా ఇబ్బంది ఉంటే తన కార్యదర్శి ధనుంజయ రెడ్డికి చెప్పాలని సూచించారు. రాజకీయాల్లో తనతో మరో పాతిక, ముప్పై సంవత్సరాలు ఉంటావని అధినేత ధైర్యం చెప్పారని సమాచారం. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
అధినేత హామీ నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తనకు సీఎం కార్యాలయం నుండి పిలుపు రావడంతో వెళ్లి కలిశానని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనకు జరుగుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానని, రాష్ట్రంలో ప్రతిచోట ఇలాంటివి ఉంటావని, వాటిని ఎదుర్కోవాలని, తగు విధంగా సమాధానం చెప్పాలని తనకు సూచించారన్నారు. తాను నిరాశతో మాట్లాడిన సందర్భంలో… మరో పాతికేళ్లు తనతో కలిసి నడుస్తావని, కాబట్టి నియోజకవర్గానికి వెళ్లి గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పనులను కూడా ఆయన దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. సీఎం ఆదేశానుసారం వచ్చే నాలుగైదు రోజుల్లో కార్యక్రమాలను చేపడతానన్నారు. విబేధాలను పరిష్కరించుకొని, కలిసి కట్టుగా ముందుకు సాగుతామన్నారు. తాను చెప్పిన సమస్యలను జగన్ (YS Jagan) సావధానంగా విన్నారన్నారు. నా బాట ఎప్పటికీ వైసీపీ బాటనే అన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ఆయన వెంటే నడుస్తానన్నారు. వ్యక్తిగత అవసరాలు, స్వార్థం కోసం పార్టీలు మాట్లాడే తత్వం తనది కాదన్నారు. మేం వైసీపీ సైనికులం… జగన్ ముఖ్య అనుచరుడిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు.
పార్టీ గీత దాటి ఇబ్బందులు పెట్టేవారిపై కచ్చితంగా జగన్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరు ఉన్నా.. లేకపోయినా.. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. కొంతమందికి రాజకీయం లేకుంటే మరో పని చేయలేరని, కానీ తాను ఎప్పటికీ అధినేత వెంటనే ఉంటానని, మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే వ్యాపారం చేసుకుంటానని స్పష్టం చేశారు. కానీ జగన్ తనకు పాతికేళ్లు తన టీమ్‌లో ఉండాల్సిందేనని చెప్పారన్నారు. మనకు ఉన్న ఇబ్బందులు చెప్పినప్పుడు, సానుకూలంగా స్పందించినప్పుడు ఆయన వెంటనే నడుస్తామని చెప్పారు. ఇదివరకు సమస్య ఆయన దృష్టిలో లేదని, ఇప్పుడు కూడా నీ పని నీవు చేసుకో, మరొకరిని పట్టించుకోవద్దని సూచించారన్నారు.