RK Roja: ఆ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సభలకు రాకుండా చేయాలి
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా సోమవారం డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ఇష్టారీతీన వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హద్దు మీరితే శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) సోమవారం డిమాండ్ చేశారు. స్పీకర్ వద్దకు ఎవరూ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడి ఆరోపణల నేపథ్యంలో ఆమె సభలో మాట్లాడారు. సభలో ఆటంకం కలిగిస్తున్నందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ (TDP MLAs suspension) చేసినట్లు చెప్పారు. గతంలో తనను ఏడాది పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.
బీసీలు అంటే చంద్రబాబుకు (Chandrababu Naidu) ఎప్పుడూ చులకనే అనే విషయాలను గమనించాలన్నారు. గతంలో కూడా బీసీల తోకలు కత్తిరించాలని, బీసీలు జడ్జీలుగా పనికిరారని మాట్లాడిన చంద్రబాబుకు బీసీలంటే ఎప్పుడు చులకనే అన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పైన పేపర్లు చింపి విసురుతూ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేలను చట్ట సభల నుండి సస్పెండ్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. మీరు స్పీకర్ అయినప్పుడు కనీసం మిమ్మల్ని కూర్చో బెట్టేందుకు రాని వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మీరు స్పీకర్ కావడం ఇష్టం లేని చంద్రబాబు ఇలా చేస్తున్నారు. ఎవరైతే పోడియం వద్దకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో, స్పీకర్ వద్దకు వచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తారో.. స్పీకర్ చైర్ ను అగౌరవపరిచే వారికి భయం పుట్టేలా చర్యలు ఉండాలని, అందుకే అలాంటి వారిని శాశ్వతంగా చట్ట సభలకు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
మా ఎమ్మెల్యే సుధాకర్ బాబు పైన దాడి చేసిన, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని బూతులు తిట్టి, పైగా బయటకు వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేలు మా పైన దాడి చేశారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎస్సీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి పైన దాడి చేశారని చెప్పడం విడ్డూరమన్నారు. వారు అలా మాట్లాడుతూంటే బాధగా ఉందన్నారు. ఈ చట్ట సభల్లో వారే దారుణాలు చేసి, మళ్లీ బయటకు వెళ్లి అబద్దాలు చెప్పడం ఎంత వరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని, వారికి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. రోజా ఇంకా మాట్లాడుతూ… కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అన్నారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు… 11 మందిని చంపారని, అందుకే కదా జీవో నంబర్ 1 తీసుకొచ్చామన్నారు. ఇదంతా ప్రతిపక్షాల మీద కోపంతో కాదని, ప్రజల రక్షణ కోసమే అన్నారు. సభలో టీడీపీ సభ్యుల తీరు సరికాదని, వారికి స్పీకర్ అంటే గౌరవం లేదన్నారు.