హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు.
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు వస్తూ ఉంటాయని, విదేశీ సంస్థాగత మదుపరులు వెళ్లిపోతూ ఉంటాయన్నారు. మన దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలు లేదా ఆర్థిక వ్యవస్థ భావచిత్రం కానీ ప్రభావం చూపలేవన్నారు. గత రెండు రోజుల్లో 8 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం వచ్చిందని చెప్పారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించగా.. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థలు పరిశీలిస్తాయన్నారు. మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడగలిగే అధికారం, వనరులు సెబికి ఉందని, ప్రతి మార్కెట్లోనూ హెచ్చతగ్గులు, ఒడుదొడుకులు సహజమే అన్నారు.