ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూట్ ఈరోజు(ఏప్రిల్ 5)న మొదలైంది. మొదటి షెడ్యుల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరించారు. ఇది తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే సినిమాలు చేయడం గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్(Pawan kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) ద్వయంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(sreeleela) నటిస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు(ఏప్రిల్ 5) నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్(police station set)సెట్ లో మొదటి షెడ్యూల్ జరిగింది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొన్నారు.
పవన్, హరీష్ కాంబోలో ఇప్పటికి వచ్చింది ఒక్క ‘గబ్బర్ సింగ్’ సినిమానే అయినప్పటికీ..ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘గబ్బర్ సింగ్’ని మించేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా అద్భుతమైన చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్(devi sri prasad) సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ ఘన విజయంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి సంగీతంతో అలరించడానికి దేవి శ్రీ ప్రసాద్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీంతోపాటు అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.