చట్టాలకు అందరికీ సమానమని (Rules same for Everyone) రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది. రాష్ట్రపతి మొదలుకుని కుగ్రామంలోని ఓ హమాలీ పని చేసుకునే వ్యక్తి వరకు అందరికీ చట్టాలు (Acts), నిబంధనలు (Rules) సమానమే. మరి అలాంటప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) కేసు ఎందుకు నమోదు చేయరని ఓ సామాన్యుడి ప్రశ్నించాడు. మోదీ రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏకంగా డీజీపీని (DGP) కలిసి ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. మోదీ ఉల్లంఘనలకు సంబంధించిన విషయాలను తన ఫిర్యాదులో వివరించాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళలో (Kerala) ఈనెల ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించారు. తొలి రోజు కొచ్చిలో మోదీ భారీ రోడ్ షో (Road Show) నిర్వహించాడు. ఆ రోడ్ షోలో కారు డోర్ పట్టుకుని నిల్చుని రోడ్లకు ఇరువైపులా నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. ర్యాలీ సందర్భంగా ప్రజలు పూలు చల్లారు. దీంతో కారు అద్దం పూర్తిగా మూసుకుపోయింది. పూలు అడ్డంగా ఉంటే రోడ్డు ఎలా కనిపిస్తుంది? కేరళకు చెందిన జయకృష్ణన్ (Jayakrishnan) అనే వ్యక్తి ప్రశ్నించాడు. కొచ్చి పర్యటనలో ప్రధాని రోడ్డు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ తిరువిల్ మల అనే ప్రాంతానికి చెందిన జయకృష్ణన్ బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. డీజీపీ అనిల్ కాంత్ ను కలిసి మోదీపై రాష్ట్ర మోటార్ వాహన శాఖకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. ‘చట్టం అందరికీ సమానమే. అందరూ నిబంధనలు పాటించాల్సిందే’ అని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.
కాగా, కేరళలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వందే భారత్ రైలును (Vande Bharat Express) ప్రారంభించాడు. వాటర్ మెట్రో (Water Metro), డిజిటల్ సైన్స్ పార్క్ లను రిబ్బన్ కట్ చేశాడు. ఈ పర్యటనను కేరళ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ ఒక్క సీటు కూడా పొందని రాష్ట్రంగా కేరళ నిలుస్తోంది. మలయాళ గడ్డపై ఖాతా తెరువాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కానీ కేరళ ప్రజలు బీజేపీని ఆదరించడం లేదు. ఎంత ఘనాపాటిలు ప్రచారం చేసినా కేరళలో కమలం పార్టీ ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోవడం లేదు.