ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీల వారు సమాయత్తమౌతున్నారు. ప్రజలను ఎలా ఆకర్షించాలా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే…. జగన్, చంద్రబాబు, పవన్ లు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల మద్దతు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్.. ఉండవల్లి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తనను క్షమించాలని.. నారా లోకేశ్ ప్రజలను కోరారు. దీంతో అక్కడున్న ప్రజలు కొందరు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
టీడీపీ హయాంలో పుష్కారాల సమయంలో.. సీతానగరం ఘాట్ దగ్గర ఉన్న నివాసాలను తొలగించి.. వారికి ఉండవల్లి దగ్గర స్థలాలు ఇచ్చారు. అన్ని సదుపాయాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పుడు కుదరలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో.. నారా లోకేశ్ వారు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. వాళ్ల పరిస్థితి చూసి ఆవేదనకు గురయ్యారు.
‘మా ప్రభుత్వంలోనే మీకు ఇళ్లు, కరెంటు, సదుపాయాలు ఇచ్చి ఉంటే.. మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితికి కారణం అయిన మమ్మల్ని క్షమించండి. చేతులు జోడించి అడుగుతున్నా’ అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. మీరు ధైర్యంగా ఉండండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. రాగానే అన్ని సదుపాయాలు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.