»Meena Calls For Zero Violence No Repoll In Conduct Of Elections In Ap
EC : సొంత టీవీ ఛానళ్లలో ప్రచారమూ ఎన్నికల వ్యయమే : ఏపీ సీఈఓ
సొంత టీవీ ఛానళ్లు కలిగిన రాజకీయ పార్టీల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు చేసే ప్రచారాలను కూడా ఎన్నికల వ్యయంలో భాగంగా లెక్కగడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి పలు మార్గదర్శకాలను ప్రకటించారు.
AP state chief electoral officer : రాజకీయ పార్టీలకు ఉన్న టీవీ ఛానళ్ల ద్వారా సొంత పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసినా దాన్ని ఎన్నికల వ్యయం కిందే పరిగణిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీరా వెల్లడించారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రస్తుతం లోక్ సభ అభ్యర్థులైతే రూ.95 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులైతే రూ.40 లక్షల మేర ఎన్నికల వ్యయం చేయవచ్చునని తెలిపారు.
టీవీలో ప్రచారాల్లాంటి విషయాలపై మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ఓ కన్నేసి ఉంచుతుందని అన్నారు. ఏమైనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కమిటీ తొలుత నోటీసులు జారీ చేస్తుందని తర్వాత తదుపరి చర్యలు తప్పక తీసుకుంటామని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయకూడదన్నారు. వారు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని చెప్పారు. అది సర్వీసు నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఒక వేళ ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
అలాగే ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే వాటికి జిల్లా ఎస్సీలనే బాధ్యుల్ని చేస్తామని తెలిపారు. రీ పోలింగ్‌కు(repoll) ఎక్కడా అవకాశాలు లేకుండా ఈ సారి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ప్రచురించే ప్రకటనలకు ఎన్నికల సంఘం నుంచి తొలుత అనుమతి కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే తాము పెయిడ్ ఆర్టికల్స్ మీదా నిఘా ఉంచామన్నారు.