దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. అలాంటప్పుడు ఈ ఏడున్నర దశాబ్దాల్లో ఏం సాధించినట్లు అన్నారు.
కొందరు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జాతి, ధర్మం, పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, వారు ఎన్నికలలో గెలిచి ఏం చేస్తారో చెప్పాలని నిలదీశారు. ఒడిశాలో ఎన్ని నదులు ఉన్నా, కనీసం తాగునీరు లేదన్నారు. రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. మహారాష్ట్రలో సంపద లేదా.. రైతులు చట్టసభల్లోకి రావాలన్నారు.
ఇదిలా ఉండగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో గిరిధర్‌కు కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గమాంగ్ 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు పది నెలలపాటు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తీరు నచ్చక 2015లో బీజేపీలో చేరారు. గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా గెలిచారు.