పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణకు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ తో దాడి చేశాడు. గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఏపీలోని పెనుకొండ ఎమ్మెల్యే(penukonda mla), మాజీ మంత్రి శంకర నారాయణ కాన్వాయ్ పై ఎటాక్ జరిగింది. ఓ వ్యక్తి డిటోనేటర్ ను ఎమ్మెల్యే కారుపై విసిరాడు. అయితే అది ప్రమాదవశాత్తు గురితప్పి పొదల్లో పడింది. ఆ క్రమంలో అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి అక్కడున్న వారంతా తప్పించుకున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడున్న పలువురు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ దాదాపు 12 గంటల ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది.
అయితే ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? ఈ ఎమ్మెల్యే విషయంలో అతనికి ఏమైనా పాత తగాదాలు ఉన్నాయా ? లేదా ఎవరైనా ఇతర పార్టీల ప్రమేయం ద్వారా అలా చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా..ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. పోటీపోటీగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అయితే ఇంకా ఎన్నికల సమయం రాకముందే ఇలా ఉంటే..ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఏపీ(AP)లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనని స్థానికులు అనుకుంటున్నారు.