కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా… జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే… గుజరాత్ ఎన్నికల భేరీ మోగడంతో…. ఆయన అందులోనూ పాల్గొనడం విశేషం. ఓ వైపు జోడో యాత్ర చేస్తూనే.. తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పనిచేస్తోందని ప్రజల కోసం కాదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సూరత్ నుంచి ప్రారంభించారు. భారత్ జోడో యాత్ర మధ్యలో వచ్చి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం గుజరాత్లో తమకు కలిసి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని రాహుల్ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అడవులన్నీ వ్యాపార వేత్తలకే కట్టబెడతారని అడవులను నిర్ములిస్తారని ఎద్దేవా చేసారు. గిరిజనులకు చెందిన భూములను పారిశ్రామిక పెద్దలకు కట్టబెడుతున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
గిరిజనులను బీజేపీ మోసం చేస్తుందని మండిపడ్డారు. లాక్కున్న భూములన్నింటినీ తాము అధికారంలోకి వస్తే తిరిగిస్తామని అన్నారు.మోర్బీ వంతెన కూలి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మిగతావారు గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు డిసెంబర్ 8న గుజరాత్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి.