Dubai Princess: దుబాయ్ యువరాణి షేక్ మహ్రా బింట్ తన భర్తకు ఆన్లైన్లో విడాకులు ఇచ్చింది. పెళ్లయి ఏడాది మాత్రమే కాగా రెండు నెలల క్రితం వీరికి కూతురు పుట్టింది.ఆ సంతోషం ఎంతో కాలం లేకుండానే రెండు నెలలకే ఈ ప్రకటన రావడంతో తీవ్ర సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టు చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె యూఏఈ ప్రధానమంత్రి , దుబాయ్ రాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తకు ట్రిపుల్ తలాక్ రాసి తన భర్తతో అన్ని సంబంధాలను ముగించుకుంది. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆమె తన పోస్ట్‌లో వివరించారు. ‘ప్రియమైన భర్తకు.. ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డైవర్స్ యూ’. టేక్ కేర్.. మీ మాజీ భార్య’’ అని షైకా మహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, వారు కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు.. షైకా మహ్రా అకౌంట్ హ్యాక్ అయ్యిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. పలువురు నెటిజన్లు మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మహ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
షేక్ మహారా ఎవరు?
షేఖా మహరా యూఏఈ ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమె దుబాయ్ రాజకుటుంబం నుండి వచ్చింది. ఆమె తన తండ్రికి ఉన్న మొత్తం 26 మంది సంతానంలో ఒకరు. ఆమె తల్లి, జో గ్రిగోరాకోస్, గ్రీక్. ఆమెకు అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమె తండ్రి, తల్లి కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తన తండ్రి మహమ్మద్ బిన్ రషీద్‌కు మొత్తం ఆరు పెళ్లిళ్లు అయ్యాయి. తన తండ్రి తల్లి విడాకులు తీసుకున్నప్పటికీ ఆమె తన తల్లితో నిరంతరం టచ్‌లో ఉంటారని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు తెలియజేస్తున్నాయి.
సోషల్ మీడియా సెలబ్రిటీ
దుబాయ్ యువరాణి షేఖా మహరా ఒక సామాజిక కార్యకర్త, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, వ్యాపారవేత్త. 2023లో ఆమె ఆదాయం అంచనా 300 మిలియన్ డాలర్లు. మహ్రా యూఏఈ, విదేశాలలో అనేక దాతృత్వ, మానవతా సాయాలు చేస్తుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఆమె ఎప్పుడూ ముందుంటుందని ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు తెలియజేస్తున్నాయి. మహ్రా చాలా కాలం డేటింగ్ తర్వాత షేక్ మనా బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం 5 ఏప్రిల్ 2023న ఒక ప్రైవేట్ వేడుకలో అధికారికంగా ప్రకటించారు.. మేలో వివాహం జరిగింది.