»A Family Staying In A Hole Last Six Years In West Bengal
West Bengal : ఆరేళ్లుగా గుంతలో నివసిస్తోన్న కుటుంబం..
ఆరేళ్లుగా గుంతలోనే ఉంటున్న వీరికి కనీసం త్రాగునీరు కూడా లేవు. వర్షం పడ్డప్పుడు గుంతలోకి నీరు చేరి అక్కడకూడా ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరేళ్లుగా ఓ కుటుంబం దారుణ పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఐదుగురు సభ్యులుగల ఈ ఫ్యామిలీ ఆరేళ్లుగా గుంతలో తలదాచుకుంటుంది. ఏ నాయకుడుగాని, ప్రభుత్వంగాని వారికి సహాయం చేయడానికి ముందుకు రావడంలేదు. ఓట్లు వేయమని ఐదేళ్లకోసారి అక్కా, అమ్మ, బాపూ అంటూ ఓటర్ల ప్రేమను పొందడానికి నానా వేషాలు వేసే రాజకీయనాయకులు ఆతర్వాత ప్రజల ముఖం కూడా చూడటం లేరు.
డైనమిక్ లీడర్ గా పేరుతెచ్చుకున్న పశ్చిమబెంగాల్ ( West Bengal ) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee ) రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ జల్పాయ్ గుడిలోని ఛాప్ గఢ్ గ్రామంలో ఓ కుటుంబం ఆరేళ్లుగా గుంతలోనే నివసిస్తోంది. ఐదుగురు కుటుంబ సభ్యులుగల వీరికి పక్కా ఇళ్లు లేదు. రేకుల షెడ్డులాగా వేసుకుని అందులోనే నివసిస్తున్నారు. భారీ వర్షం, తుఫాను లాంటివి ఏర్పడినప్పుడు రేకుల షెడ్డు గాలికి కొట్టుకపోవడంతో.. వర్షంలోనే ఉండాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీ మోహన్ రాయ్ అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని నడుపుతున్నాడు. అయితే వారు నివసించే రేకుల షెడ్డు గాలికి చాలా సార్లు కొట్టుకపోయిందని చెప్పారు. కనీసం తాగడానికి ప్రభుత్వ నీటి కనెక్షన్ కూడా లేదని అన్నారు. ఎటువంటి ప్రభుత్వ పథకం కూడా అందడం లేదని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వం సహాయం చేయాలని అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ఎక్కడ ఉండాలో తెలియక గుంత తవ్వి అందులోనే నివసిస్తున్నట్లు చెప్పారు. మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు గుంతలోనే తలదాచుకుంటున్నారు. ఇంటి సమీపంలో ఓక గుంతను తవ్వుకోగా అందులో నీళ్లు ఊరినప్పుడు తాగటానికి వాడుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం దయతలచి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.