KTR: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయాడని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయం పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పెద్దలకు లేఖ రాశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారని తెలిపారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి అని.. ఈ విషయం కాంగ్రెస్ నేతలే చెబుతున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
బీజేపీకి అదానీ నుంచి గట్టిగా డబ్బులు వస్తున్నాయట అని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు అందితే.. కల్యాణలక్ష్మీ వస్తే.. షాదీ ముబారక్ చెక్కులు వస్తే తమకు ఓటేయాలని కోరారు. గత తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేశాం అని వివరించారు. షాద్ నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్.. తెచ్చేది అంజయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కడుపులో గుద్ది.. నోటిలో పిప్పర్ మెంట్ పెడతారని తెలిపారు. బీజేపీ నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులపై కేసులేసి ఇబ్బందికి గురిచేస్తారని మండిపడ్డారు.
అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తోందని విరుచుకుపడ్డారు. మోసాన్ని మోసంతోనే జయించాలని.. ఓటు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.