BDK: ఇల్లందు–కారేపల్లి మార్గంలోని ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్ వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి శనివారం తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమాదాలు దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
NLG: కోదాడ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నిరంతరం కృషి చేస్తుందని అని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. శనివారం మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటగది నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని శంకుస్థాపన చేశారు.
HYD: ఎంతో నిష్ఠతో అయ్యప్ప స్వామిని పూజించే అయ్యప్పలకు అల్పాహారం, నిత్య అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో గొప్ప కార్యక్రమం అని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్‌పేటలోని ఆవులమంద శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్పలకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
SRPT: గరిడేపల్లి మండల కేంద్రంలోని సూర్యాపేట లయన్స్ ఐ హాస్పటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం లయన్స్ క్లబ్ రీజనల్ ఛైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి చూపు అందించడమే లక్ష్యంగా లయన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
MHBD: జిల్లా కోర్టు, ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్)గా తాటిపాముల సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గుంపెల్లగూడెం గ్రామానికి చెందిన తాటిపాముల సునీత గత పది సంవత్సరాలుగా లాయర్‌గా జిల్లా కోర్టులో పనిచేస్తున్నారు. నేడు ఏజీపీ సునీత బాధ్యతలను స్వీకరించారు.
NRML: జిల్లా కేంద్రంలో నిర్వహించే నుమాయిష్ (ఎగ్జిబిషన్)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నుమాయిష్ నిర్వహణపై ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 5 నుండి 7 వరకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
KMR: టర్కీ దేశ రాయబారి ఒర్హాన్ ఎల్మన్ బకన్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పాత మిత్రుడైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాదులోని నివాసానికి తన సతీమణితో కలిసి వచ్చారు. ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కౌలాస్ కోట, నిజాంసాగర్ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరించారు.
NLG: మిర్యాలగూడ పట్టణంలోని MLA క్యాంపు కార్యాలయం నుండి NSP క్యాంపు గ్రౌండ్ వరకు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ADB: పత్తి నిల్వలు పేరుకుపోయిన దృష్ట్యా ఈ నెల 29 నుంచి జనవరి 1 వరకు సీసీఐ ఆధ్వర్యంలో బేలలోని ఆశాపుర జిన్నింగ్ మిల్లులోని కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు. జనవరి 2 నుంచి ప్రతిరోజు కేవలం 80 పత్తి వాహనాలకు మాత్రమే టోకెన్ ఇస్తామన్నారు. మిగిలిన వాహనాలకు మరుసటి రోజు జారీ చేస్తామన్నారు.
KNR: శంకరపట్నం మండలం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రూ. 6000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాలా కన్వర్షన్ కోసం మండలంలోని ఓ వ్యక్తి అనుమతులు కోరగా.. మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
HNK: హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాజీపేట మండల పరిధిలోని 44, 64 డివిజన్లకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 18 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. నిరుపేద ప్రజలకు ఎంతోఅండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నరు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వెడల్పు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.2.35 కోట్లతో 1.5 కి.మీ. రోడ్డు వెడల్పు చేయడానికి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం రూ.35 లక్షలతో డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో టెండర్లను పిలిచి పనులు ప్రారంభించునున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ భారతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది అని చెప్పారు. 10 ప్రైవేట్ కంపెనీలు మేళాలో పాల్గొంటారని చెప్పారు. పది నుంచి బీటెక్ వరకు చదివిన విద్యార్థులు పాల్గొనవచ్చని సూచించారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని శనివారం కుటుంబ సమేతంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వాదం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.
NRPT: మరికల్ పెట్రోల్ బంకు వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమత్తులు కారణంగా నీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా కార్యనిర్వహక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లోని 245 గ్రామాలలో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు.