తెలంగాణ ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రిలో చేర్చారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారం చేయడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుస్తోంది.
Komati Reddy Venkat Reddy: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర గొంతు నొప్పితో బాధపడిన కోమటిరెడ్డిని కుటుంబ సభ్యులు నిన్న సాయంత్రం యశోద ఆసుపత్రిలో చేర్చారు. ఎన్నికల ప్రచారం నుంచే అతను గొంతు నొప్పితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. విరామం లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించడం వల్ల ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయ్యిందని సమాచారం. అందులో ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం, చలి ఎక్కువ కావడంతోపాటు ఉష్ణోగ్రతలు తక్కువ కావడంతో కోమటిరెడ్డికి గొంతు నొప్పి తీవ్రమైంది. అయితే ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెబుతున్నారు.
కోమటిరెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌ను కోరారు. తర్వాత హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఇటీవల ఫాంహౌస్‌లో జారిపడ్డ కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రిలో చేర్చారు. తుంటికి గాయం కావడంతో సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను కోమటిరెడ్డి పరామర్శించారు. అనంతరం గొంతు నొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.