BRS : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును చికిత్స నిమిత్తం గురువారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు వైద్యులు స్టంట్ వేశారు. విద్యాసాగర్ రావు ప్రస్తుతం ఆసుపత్రిలోనే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఏకధాటిగా నాలుగుసార్లు వరుస విజయాలను నమోదు చేశారు.
2009, 2010 ( ఉప ఎన్నిక) 2014, 2018 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కారణాలేంటో తెలియదు కానీ.. ఈసారి ఎన్నికల్లో విద్యాసాగర్‌రావు పోటీ నుంచి తప్పుకున్నారు. తన తరఫున కొడుకు కల్వకుంట్ల సంజయ్‌కు అవకాశం కల్పించారు. ఆయన బీజేపీ అభ్యర్థి అర్వింద్‌పై విజయం సాధించారు. అయితే బీఆర్ఎస్ ఓటమిపై విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని.. అయినా ఓడిపోవడం బాధ కలిగించిందన్నారు. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆస్పత్రిలో చేరారు. జారి పడిపోవడంతో కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు.