Archers Jyoti Vennam, Aditi Swamy, Parneet Kaur win gold in archery at Asian Games
Asian Games: ఆసియా క్రీడలు 2023లో (Asian Games) భారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల ఆర్చరీ జట్టు విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం అద్భుత ప్రదర్శన కనబరిచి పసిడిని గెల్చుకున్నారు. చైనీస్ తైపీపై భారత్ బృందం విజయం సాధించింది. టీమ్ఇండియా బృందం 230-229 తేడాతో గోల్డ్ పతకం నెగ్గింది. దీంతో భారత్ ఖాతాలో 19వ పసిడి పతకం చేరింది. దీంతో ఇండియా మొత్తం పతకాల సంఖ్య 82కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
అయితే జ్యోతి సురేఖ వెన్నం మన తెలుగు యువతి కావడం మనకు గర్వకారణం. జ్యోతి తండ్రి కబడ్డి క్రీడాకారుడు కావడంతో ఆటలపై తనకున్న ముక్కువతో 2007లో ఆర్చరీ శిక్షణలో చేర్పించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విలువిద్యలో చక్కటి ప్రతిభను కనబరుస్తూ అందరి మన్ననలు పొందింది. ఒక్కోక్కటిగా సాధిస్తూ తన విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. 27 ఏళ్ల జ్యోతి ఇప్పటివరకు అనే రికార్డులను సాధించింది. అందులో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో 4 రజత, 2 కాంస్య పతకాలు సాధించింది. ప్రపంచ కప్‌లో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలు, ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు, ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఈమె ముందు స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుంది. తరువాత దాన్ని వదిలి ఆర్చరీలో ట్రైన్డ్ అయింది. 2011 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. జ్యోతి విజయవాడలోని వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందింది. 13 సంవత్సరాల వయస్సులో, ఆమె మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ ఆర్చరీ పోటీలో ఐదు పతకాలను కైవసం చేసుకుంది.
ఆర్చరీ రంగంలో ఆమె సాధించిన విజయాలకు అర్జున అవార్డు లభించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆమెకు కోటి రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక స్టేడియంకు వెన్నం జ్యోతి సురేఖ స్టాండ్ అని పేరు పెట్టారు.