సంక్రాంతి పందెంకోడిలా థియేటర్లలోకి దూసుకొచ్చిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. నందమూరి అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి.. నీరాజనాలు అందుకుంటోంది. అయితే.. వీరసింహారెడ్డి వీర విహారానికి ఓ థియేటర్ యాజమాన్యం బ్రేక్ వేసింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు, డ్యాన్సులు చూసి వీర లెవల్లో ఊగిపోతున్నారట. జై బాలయ్య అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున్నారట. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన సందడికి షోని మధ్యలో ఆపేశారు థియేటర్ నిర్వాహకులు.
తెర మీద తమ అభిమాన హీరోని చూసేసరికి తట్టుకోలేక విజిల్స్, పేపర్లు, నినాదాలు చేశారట బాలయ్య అభిమానులు. దీంతో.. థియేటర్ యాజమాన్యం సినిమాలో మధ్యలోనే ఆపేసింది. ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాలు ప్రదర్శించినా.. ఇలాంటి రచ్చ ఎప్పుడూ జరగలేదని వాపోతున్నారట. అమెరికాలాంటి హై ఎండ్ టెక్నాలజీ ఉన్న దేశంలోని థియేటర్ తెర మీద బాలయ్య నటవిశ్వరూపం చూసేసరికి అభిమానులు తట్టుకోలేకపోవడం న్యాయమే. కాకపోతే థియేటర్ ఓనర్ పరిస్థితి కూడా ఆలోచించాలి అంటున్నారు నెటిజనులు. సంక్రాంతి బరిలో నిలిచిన వీర సింహారెడ్డి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా వీర విహారం చేస్తున్నాడనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలంటున్నారు నందమూరి అభిమానులు.