AC and Ceiling Fan : ఇప్పుడిప్పుడే ఎండలు పెరగడం మొదలైంది. దీంతో ఏసీల వాడకమూ పెరుగుతోంది. అయితే చాలా మంది ఏసీ వేసుకున్నప్పుడు ఫ్యాన్‌ని వేసుకోకూడదని అంటుంటారు. కానీ చాలా మంది మాత్రం ఇదే పని చేస్తుంటారు. ఈ విషయంలో నిజా నిజాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏసీని వేసుకున్నప్పుడు ఫ్యాన్(Fan) వేసుకుంటే గది అంతా చల్లగాలి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే చేస్తుంటారు కూడా. అయితే కొంత మంది మాత్రం ఫ్యాన్ వేస్తే ఆ గాలి ద్వారా బయటి వేడి లోపలికి వస్తుందని అందుకనే రెండింటినీ కలిపి వాడకూడదని చెబుతుంటారు. అయితే ఇందులో ఏమాత్రమూ నిజం లేదు. నిజానికి ఫ్యాన్ అనేది బయటి వేడిని లోపలికి తీసుకుని రాలేదు. అలాగే బయట గాలినీ లోపలికి తేలేదు. గదిలో ఉన్న గాలినే సర్క్యులేట్ చేస్తుంది అంతే.
నిజానికి ఏసీ(AC)తో కలిపి సీలింగ్ ఫ్యాన్‌ని కలిపి వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలా చేయడం వల్ల గది మొత్తం చల్లటి గాలి సరఫరా అవుతుంది. దీంతో ఎక్కువ సమయం ఏసీని వాడాల్సిన పని ఉండదు. అందువల్ల కరెంటు బిల్లులూ చాలా వరకు తగ్గుతాని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏసీని, ఫ్యాన్‌ని వాడుతున్నప్పుడు కచ్చితంగా ఆ గది పూర్తిగా మూసి ఉండాలి. చిన్న చిన్న రంధ్రాల్లాంటివి ఉంటే వాటిని సీల్ చేయాలి. కిటికీలు, తలుపుల పక్కన చిన్న చిన్న గ్యాప్స్ లేకుండా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. అప్పుడు మాత్రమే వీటి వల్ల వచ్చిన చల్లదనం ఎక్కువ సేపు గదిలో నిలిచి ఉంటుంది.