»Cm Kcr Extedns Greetings To Nation On Sri Rama Navami
sri rama navami: మోడీ, కేసీఆర్, రేవంత్, బండి సంజయ్, కవిత శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరామ నవమి (sri rama navami) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana KCR), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana chief Bandi Sanjay), తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Congress Telangana president Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ జీవనానికి శ్రీ సీతా రామచంద్రమూర్తులు (Sri Sita Rama) ఆదర్శులని సీఎం కేసీఆర్ అన్నారు. కుటుంబ విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత కాలంలో సీతారాముల ఆశయాలను, విలువలను అన్వయించుకుంటూ ఆదర్శవంతమైన కుటుంబ జీవనాన్ని కొనసాగించేందుకు శ్రీ రామ నవమి పండుగ ఒక ప్రత్యేక సందర్భమని తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలకు ఆయన శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అన్యోన్య దాంపత్యానికి మారుపేరైన సీతారాములను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పులుగా హిందువులు కొలుచుకుంటారన్నారు. వసంత రుతువులోని చైత్రశుద్ధ నవమిన ఆదర్శ దంపతులైన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వాడవాడలా వైభవంగా దేశ ప్రజలు అందరూ ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయమని అన్నారు.
ఇంటికి పెద్ద కొడుకుగా కుటుంబ బాధ్యతలకు, కట్టుబాట్లకు అ త్యంత విలువను ఇచ్చి, తండ్రి మాట కోసం కష్టాలను తన జీవితంలోకి ఆహ్వానించిన శ్రీరాముడు తరతరాలకు ఆదర్శనీయుడన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తాను నమ్మిన సత్యశీలత, ధర్మనిరతిని ఆచరించి చూపిన శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీ సీతారామ చంద్రస్వామి కృపాకటాక్షాలతో రాష్ట్రం, దేశం సుభిక్షింగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైభవోపేతంగా నిర్వహిస్తుందన్నారు.
సూర్యవంశ పాలకుడు… సకలజన పూజితుడు… ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు ఉండాలని ఆకాంక్షిస్తూ… ఆదర్శ దంపతులు… శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా… అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ రామ నవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister of India Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. త్యాగం, కాఠిన్యం, సంయమనం, సంకల్పం ఆధారంగా మర్యాద పురుషోత్తమ భగవానుడు రామచంద్రుడి జీవితం ప్రతి యుగంలో మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.