»Yuvagalam Padayatra From 27 Josh Among Tdp Leaders
Nara Lokesh: 27 నుంచి ‘యువగళం’ పాదయాత్ర.. టీడీపీ శ్రేణుల్లో జోష్
చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన నారాలోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ పునఃప్రారంభం కానుంది. నవంబర్ 27వ తేది నుంచి పాదయాత్ర సాగుతుందని, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి బయటకు రావడంతో టీడీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై నారా లోకేష్ స్పందించారు.
అందరి ఆశీస్సులతో తాను యువగళం పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 27వ తేది నుంచి పాదయాత్ర సాగుతుందన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యువగళం పాదయాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవంబర్ 27వ తేది నుంచి పునఃప్రారంభం అయ్యే పాదయాత్ర మొదటి రోజు కోనసీమ జిల్లాలో సాగుతుందన్నారు.
రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, తాటిపాక సెంటర్ వరకూ ఆ పాదయాత్ర సాగుతుందని వెల్లడించారు. అలాగే తాటిపాక సెంటర్లో బహిరంగ సభ ఉంటుందన్నారు. సభ తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 15 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర సాగి ఆ తర్వాత అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రలో పాల్గొనవలసిందిగా కార్యకర్తలను, టీడీపీ అభిమానులను కోరారు.