మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పైన సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. కాల్ డేటా మొదలు ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై సుదీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు విచారించింది. విచారణ అనంతరం మరోసారి రావాలని సూచించింది సిబిఐ. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా కొంతమంది బురద జల్లుతున్నారని, అందుకే విచారణను వీడియో తీయమని కోరగా అంగీకరించలేదని చెప్పారు అవినాష్. న్యాయవాదిని కూడా అంగీకరించలేదని, ఒక్కడినే విచారణకు వచ్చానని, పిలిస్తే మళ్లీ రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విచారణకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించలేనని చెప్పారు.
2019లో వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. తొలుత గుండెపోటుతో చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ హత్య కేసు నమోదయింది. ఏడాదిన్నర తర్వాత హైకోర్టు జోక్యంతో సీబీఐకి అప్పగించారు కేసును. సీబీఐ విడతల వారీగా క్షేత్రస్థాయిలో ఆధారాలు, సాక్ష్యుల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.