»Pakistan Cricket Board Pcb Chief Selector Inzamam Ul Haq Resigned
Inzamam-ul-Haq Resigned: పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ రాజీనామా
2023 వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెట్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
Inzamam-ul-Haq Resigned: 2023 వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుండగా పాకిస్థాన్ క్రికెట్ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ జకా అష్రఫ్‌కు పంపారు. 53 ఏళ్ల ఇంజమామ్-ఉల్-హక్.. హరూన్ రషీద్ తర్వాత ఈ ఏడాది ఆగస్టు నెలలో పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఈ పదవిలో మూడు నెలల కన్నా తక్కువ కాలం కొనసాగాడు. ఇంతకు ముందు 2016-19లో ఇంజమామ్ చీఫ్ సెలెక్టర్ పదవిని కూడా నిర్వహించారు. అతను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలోనే 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌ను ఓడించి పాకిస్తాన్ గెలుచుకుంది.
జట్టు ఎంపిక ప్రక్రియకు సంబంధించి మీడియాలో వచ్చిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు పీసీబీ 5 మంది సభ్యుల నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో తన నివేదికను, ఏవైనా సిఫార్సులను PCB నిర్వహణకు సమర్పిస్తుంది. ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్తాన్ గొప్ప ఆటగాళ్ళలో ఒకరు. వన్డే క్రికెట్లో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ రికార్డు సృష్టించాడు. పాక్ తరఫున ఇంజమామ్ ఉల్ హక్ మొత్తం 375 వన్డేల్లో 11701 పరుగులు చేశాడు. వన్ డే ఇంటర్నేషనల్‌లో ఇంజమామ్ 10 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లలో ఇంజమామ్ ఉల్ హక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 120 టెస్ట్ మ్యాచ్‌లలో 8830 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1992 ప్రపంచకప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో ఇంజమామ్ కూడా సభ్యుడు. రిటైర్మెంట్ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్‌గా కూడా పనిచేశాడు.