New Zealand:న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లోని చైనీస్ రెస్టారెంట్లో సోమవారం రాత్రి ఓ వ్యక్తి గొడ్డలితో హల్ చల్ చేశాడు. రెస్టారెంట్లలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు, స్థానిక మీడియా ప్రకారం ఒక బాధితుడు డిశ్చార్జ్ అయ్యాడని..ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని ఆక్లాండ్ ఆసుపత్రి ప్రతినిధి మంగళవారం తెలిపారు.
మీడియా నివేదికల ప్రకారం.. నిందితుడు జాంగ్లియాంగ్ మాల్టాంగ్, యుస్ డంప్లింగ్ కిచెన్, మాయా హాట్‌పాట్ అనే మూడు చైనీస్ రెస్టారెంట్లకు వెళ్లి సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో యాదృచ్ఛికంగా గొడ్డలితో వ్యక్తులపై దాడి చేయడం ప్రారంభించాడు. ఓ మహిళ మాయ హాట్పాట్లో స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తుండగా, ఒక వ్యక్తి గొడ్డలితో వచ్చి ఆమెపై దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. రెస్టారెంట్‌లోని అందరూ లేచి నిలబడి “ఏం చేస్తావు? మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించినట్లు తెలిపాడు. దాడికి పాల్పడిన 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ పోలీసులు తెలిపారు. హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ప్రజలను గాయపరిచారని అతనిపై అభియోగాలు మోపారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.