ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్లోని షాహీద్ మినార్ మైదానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. నేతాజీ తన జీవితాన్నంతా దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు. నేతాజీ జీవితం దాదాపు అజ్ఞాతవాసం లాంటిదేనని, జీవితంలో ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపారన్నారు.దేశం కోసం తన సర్వస్వం త్యాగం చేశాడన్నారు. ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోందన్న ఆయన.. నేతాజీ కలలు ఇంకా నెరవేరలేదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అందరు కలిసి వాటిని సాధించారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తి చేయవచ్చన్నారు. కార్యక్రమంలో కోల్కతా, హౌరా మహానగరాల నుంచి దాదాపు 15వేల మందికిపైగా వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలంటీర్లు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.