nalleru : ఇవన్నీ తెలిస్తే నల్లేరును ఎక్కడ కనిపించినా వదలరు!
పూర్వకాలంలో నల్లేరు చిగుళ్లను వంటల్లో ఎక్కువగా చేర్చుకుంటూ ఉండేవారు. అయితే రాను రాను దీని వాడకం చాలా తగ్గిపోయింది. దీని ప్రయోజనాలు తెలిసి ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.
Cissus quadrangularis : నల్లేరు ఎక్కడైనా సరే చాలా తేలికగా పెరిగిపోయే మొక్క. చిన్న ముక్క పడేస్తే చాలు.. అదే చిలవలు, పలవలై పెద్ద పొదలా తయారవుతుంది. అంత తేలికగా పెరిగిపోయే మొక్క కాబట్టే దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అయితే దీన్ని ఆహారంలో భాగంగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలిస్తే దీన్ని ఇక మీరు ఎక్కడ కనిపించినా వదలకుండా తినే ప్రయత్నం చేస్తారు.
నల్లేరులో(Cissus quadrangularis) కాల్షియం, విటమిన్ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా అంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకనే దీని లేత చివళ్లను తుంపి ఆహారంలో ఏదో ఒకరకంగా చేర్చి తినడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. మహిళల్లో మెనోపాజ్ తర్వాత ముఖ్యంగా వచ్చే సమస్య ఎముకలు బోలుగా మారడం. ఇది క్రమంగా తింటూ ఉండటం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. మహిళలే కాదు.. ఎముకల సమస్యలు, మోకాళ్ల నొప్పుల్లాంటివి ఉన్న వారు ఎవరైనా సరే దీన్ని ఆహారంలో ఎక్కువగా తినేందుకు ప్రయత్నించాలి. అందువల్ల ఎముకలు మరింత బలోపేతం అవుతాయి. విరిగిన ఎముకలు కూడా సులభంగా అతుక్కుంటాయి.
నల్లేరు(nalleru ) రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే స్త్రీలకు పీరియడ్స్ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. అలాగే దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల పైల్స్ సమస్య తగ్గుతుంది. దీనిలో నొప్పిని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఇది పెయిన్ కిల్లర్‌లా పని చేస్తుంది. అందుకనే దీన్ని మన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడుతుంటారు.