»Joe Biden Considering Dropping Out Of Us Presidential Race
us elections : జో బైడెన్ రేసు నుంచి ఔట్.. అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్?
జో బైడెన్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటూ ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయి. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ని నిలబెట్టాలని డెమాక్రాట్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ విషయంలో బైడెన్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
us elections : ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోనున్నారనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బైడెన్‌కు తాజాగా కరోనా సైతం వచ్చింది. దీంతో ఇప్పుడాయన డెలావర్‌లోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకోవాలా? లేదా? అనే విషయంలో ఆయన ఆత్మ పరిశీలనలో పడ్డారు. ఒక వేళ ఆయన తప్పుకొన్నట్లైతే ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్‌కు డెమాక్రాట్లు నామినేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు.
జో బైడెన్‌కు మిగిలిన సమస్యలన్నీ ఒక ఎత్తయితే సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయనను అభ్యర్థిగా తప్పుకోవాలంటే పార్టీలోని కీలక నాయకులే డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బరాక్ ఒబామా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బైడెన్‌పై ఇంకా ఒత్తిడి పెరిగింది. ఈ వారాంతంలోపే ఈ విషయంపై బైడెన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీనిపై అమెరికన్ మీడియాలో ప్రస్తుతం పలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కమలాహారిస్ ఇప్పటికే పోటీ కోసం సంసిద్ధం అవుతున్నారని సమాచారం. ఏదేమైనా తొందరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది నవంబర్ 4న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతాయి.