హైదరాబాద్ శివారులోని పారిశ్రామిక ప్రాంతమైన ఐడీఏ బొల్లారం(IDA Bollaram)లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అమర్ ల్యాబ్స్(Amar Labs)లో రెండు రియాక్టర్లు ఒకేసారి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో 15 మంది కార్మికులు ఉన్నారు. వారంతా నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తుండగా వారిలో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, పేలుడు (Explosion) శబ్దానికి భయపడిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదం కారణంగా కరెంటు సరఫరా (Electricity supply) నిలిచిపోవడంతో పరిశ్రమ(Industry)లో చీకటి నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. లోపల ఎంతమంది చిక్కుకున్నారనే విషయంలో స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.ఫైర్ సిబ్బంది (Fire crew) ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ సుమారు గంటపాటు పరిశ్రమకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ల్యాబ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సహాయక చర్యలు అందడంలో ఆలస్యమైంది. కాగా, పరిశ్రమలలో ఇంకా కార్మికులు ఉన్నారా, ఎవరైనా మృతి చెందారా అన్న వివరాలు తెలియాల్సి వుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.