»Bhatti Vikramarka The Previous Government Left Every Department In Debt
Bhatti Vikramarka: గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది
విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ శాఖ అనే కాకుండా ప్రతి శాఖను అప్పుల్లో ముంచారని భట్టి మండిపడ్డారు.
Bhatti Vikramarka: భద్రాచలంలో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు కోసం గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని భట్టి తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ. 59,580 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు. కేవలం విద్యుత్ శాఖ అనే కాకుండా ప్రతి శాఖను అప్పుల్లో ముంచారని తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారని భట్టి తెలిపారు.
అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఆ కారణం చేతనే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కొంతమేరకు వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికబద్ధంగా, ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉందని తెలిపారు. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీలైనంత వరకు వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి తెలిపారు.