ఎన్నికలు నిర్వహించేందుకు సింగరేణి (Singareni) యాజమాన్యం సహకరించడంలేదంటూ కేంద్ర కార్మిక శాఖ తెలంగాణ హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈనెల 28న ఎన్నికలు షెడ్యూల్ చేశామని, కానీ యాజమాన్యం సహాయ నిరాకరణతో ముందుకు వెళ్లలేకపోతున్నామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. తుది ఓటరు జాబితాను కూడా సంస్థ ప్రకటించలేదని పేర్కొంది. ఎన్నికలు (Elections) నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థకు ఆదేశాలివ్వాలని కోరింది.
కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో అక్టోబర్ 5న విచారణ జరిగింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్మిక సంఘాల ఎన్నికలను వాయిదా (Adjournment) వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. మరోవైపు ఈ నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పును సింగరేణి డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ (Single Bench) తీర్పును నిలిపివేయాలని కోరింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం అభ్యర్థనపై తెలంగాణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోరుతూ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 11కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ (Department of Labor)హైకోర్టుకు వెళ్లింది.