తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ కౌంటరిచ్చారు.
30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఇప్పటీకీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన తండ్రి దేవినేని నెహ్రూ చనిపోయి ఐదేళ్లవుతున్నా ఇంకా ఆయనను టార్గెట్ చేయడం తగదని సూచించారు. కందుకూరు ఘటనను పక్కదోవపట్టించే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్నారు. బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి అని అన్నారు. బజారు మనిషిలా వ్యవహరిస్తున్నారని, బొండా కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉందని దేవినేని షాకింగ్ కామెంట్స్ చేశారు.
గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే బోండా ఆగడాలపై విచారణ చేసింది వాస్తవం కాదా అని అవినాశ్ ప్రశ్నించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని బోండా ఉమ బయటపడ్డాడని ఆయన ఆరోపించారు. బైక్ రేసులు, కారు రేసులు,రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చింది బోండా ఉమా,ఆయన కుమారులేనని అవినాశ్ వ్యాఖ్యానించారు.
మంత్రి పదవి కోసం చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన నీచ చరిత్ర బోండా ఉమదన్నారు. మంత్రి పదవి కోసం బ్లాక్ మెయిల్ చేస్తే చంద్రబాబు పిలిచి కబ్జాల లిస్ట్ చూపించి ఉమాకు వార్నింగ్ ఇచ్చారని అవినాశ్ ఆరోపించారు. కాపుల గొంతు చంద్రబాబు కోసారు అని అప్పట్లో బోండా ఉమా మోరిగాడని ఆయన ఆరోపించారు. బోండా ఉమా లాంటి లోఫర్ ను చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరని అవినాశ్ దుయ్యబట్టారు. బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమ అని.. ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టే జగన్ నుంచి నాకు ప్రోత్సాహం ఉంద్నారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం గురించి కానీ,తమ గురించి కానీ మాట్లాడితే తాట తీస్తామని అవినాశ్ హెచ్చరించారు.