గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి విడుత పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మొదటి విడత పోలింగ్లో మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
మొదటి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాల్లో 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆప్ సహా 36 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి.
మొదటి విడతలో బీజేపీ, కాంగ్రెస్ మొత్తం సీట్లలో అభ్యర్థులను నిలిపింది.ఆప్ 88 స్థానాల్లో, బీఎస్పీ 57 మందిని అభ్యర్థులను నిలబెట్టింది. వీరితోపాటు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 5న నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను విడుదల చేయనున్నారు.