»Today Is National Civil Services Day On April 21st Significance History
National Civil Services Day: నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం..పీఎం అవార్డులు
దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్లలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day) నిర్వహిస్తారు. దీంతోపాటు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమంగా పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు అవార్డులను కూడా ప్రధాని అందజేస్తారు.
ఈరోజు(ఏప్రిల్ 21) జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day). ఈ నేపథ్యంలో అసలు సివిల్ సర్వెంట్లు ఎవరు? వారి ప్రాముఖ్యత ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ సర్వెంట్లు ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకగా ఉంటారు. ప్రభుత్వ విధానాల అమలును చేయడం, కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం సహా ప్రజలకు ప్రయోజనాలు అందేలా చూడటం కూడా వీరి బాధ్యత.
భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఆల్ ఇండియా సర్వీసెస్ మరియు సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ A, గ్రూప్ B అనే విభాగాలుగా ఉంటాయి.
అయితే జాతీయ సివిల్ సర్వీసెస్ డేను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించడం సహా వారి విజయాలను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈ రోజును జరుపుతున్నారు. ఈ రోజున వివిధ కార్యాలయాలు తమ తమ డిపార్ట్మెంట్ల కోసం రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తాయి.
అంతేకాదు జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi) శుక్రవారం (ఏప్రిల్ 21) పౌర సేవకులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతోపాటు ఈ కార్యక్రమంలో పీఎం మోడీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్నారు.
చరిత్ర, ప్రాముఖ్యత
ఏప్రిల్ 21, 2006న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మొదటిసారిగా జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని(national civil services day) జరుపుకున్నారు. 1947లో స్వతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్లను ఉద్దేశించి ఇదే రోజు ప్రసంగించడం విశేషం. ఆ క్రమంలో తన స్ఫూర్తిదాయక ప్రసంగంలో వల్లభాయ్ పటేల్ దేశంలోని పౌర సేవకులను “భారతదేశపు ఉక్కు చట్రం”గా అభివర్ణించారు.