మనుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత అన్ని పార్టీలు స్పీడప్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఆయన సోమవారం నామినేషన్ వేయనున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కు మధ్య ఈ పోటీ జరుగుతోందన్నారు. ఈ ఎన్నిక రాష్ట్ర, దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని తెలిపారు.
మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ గెలిచిన నెల రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమన్న ఆయన.. కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.