Gutka banned: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను, పాన్ పరాఖ్లను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. అయితే గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హానికరం అని, అందులో పొగాకు, నికోటిన్ ఉండడం వలనే వాటిని నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తప్పవని ఫుడ్ సెఫ్టీ అధికారులు హెచ్చరించారు.