వరుస విషాదకర సంఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీని కలిచి వేస్తోంది. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాలం చేసిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ‘ఇందిరా దేవి’ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. ఈ ఏడాది కృష్ణ కుటుంబంలో జరిగిన రెండో విషాదమిది. జనవరిలో పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్ బాబు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దాంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మృతి పట్ల సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. ఈ వార్త తనను ఎంతో కలచివేసిందంటూ పోస్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, బండ్ల గణేశ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో పాటు చాలామంది సెలబ్రటీస్, రాజకీయ ప్రముఖులు.. మహేష్ బాబు ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. గతంలో మహేష్ అమ్మ గురించి చెప్పిన ఎమోషనల్ స్పీచ్ వైరల్ అవుతున్నాయి. తన అమ్మ చేతి కాఫీ తాగితే దేవుడి ప్రసాదం తీసుకున్నట్టు ఉంటుందని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. దాంతో మరింత ఎమోషనల్ అవుతూ.. Stay strong anna అంటూ ట్వీట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.