ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు.. దేశాన్ని కుదిపేసింది. అంజలి అనే యువతి స్కూటీ మీద వెళ్తుండగా ఓ కారు ఆమెను ఢీకొట్టి దాదాపు 12 కిమీ వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన అంజలి కన్నుమూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం పరిధి రోహిణి జిల్లా పోలీసు స్టేషన్ కిందికి వస్తుంది. ఘటన పట్ల, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు స్టేషన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంది.
ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలని నగర పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను ఆదేశించింది. దీంతో మొత్తం 11 మంది పోలీసులు విధుల్లోంచి తొలగించబడ్డారు. వీరిలో ఇద్దరు ఎస్ఐలు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఘటన జరిగిన రోజు వీరిలో ఆరుగురిని పీసీఆర్ డ్యూటీపై వేయగా.. మిగిలిన అయిదుగురికి పికెట్ బాధ్యతను అప్పగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు పోలీసులు ఈ ఘటనకు కారణమయ్యారని, వారు కూడా ఒకవిధంగా దోషులేనని దర్యాప్తు జరిపిన ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ షాలిని సింగ్ నివేదికలో పేర్కొన్నారు. ఈ పోలీసుల సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ లో వీరిపై పెట్టిన కేసుల్లో మర్డర్ అభియోగాలను కూడా చేర్చాలని హోమ్ శాఖ ఆదేశించింది.