Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేదు. సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులివ్వడం చట్టవిరుద్ధమని ఆప్ ఆరోపించింది.ఈ సమన్లపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ పెండింగ్‌లో ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకం. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.
ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు ఆరుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన హాజరు కాలేదు. విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే, ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతానని సీఎం అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.