ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేస్తారా.. కొత్త సినిమాలు ఒప్పుకుంటారా.. అనే సందేహం అభిమానులను కలవరపెడుతునే ఉంది. ఎందుకంటే.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు పవన్. దాంతో ఇన్ని రోజులు పవన్ సినిమాలు డైలామాలో పడిపోయాయి. కానీ ఇప్పుడు పవన్ స్పీడ్ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. వచ్చే ఎన్నికల లోపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు పవన్. ప్రస్తుతం క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే లేట్ అయినా ఈ ప్రాజెక్ట్‌ను.. వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతున్నారు. అయితే ఈ లోపే మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు పవన్. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది పవన్ నుంచి ఊహించకుండా వచ్చిన ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. ముందు నుంచి ‘తేరీ’ రీమేక్ అని వినిపించినా.. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్‌తోనే రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు హరీష్ శంకర్ పరిస్థితేంటనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో.. ‘భవదీయుడు భగత్ సింగ్’కు కూడా రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమాను.. అతి త్వరలో మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే వారం ‘పవన్-హరీష్’ మూవీకి ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. రేపో, మాపో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.