»Gas Cylinder Leak In Visakhapatnam Four People Died
Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ సిలిండర్ లీక్..నలుగురు మృతి
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
విశాఖపట్నం (Visakhapatnam)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీక్ (Gas cylinder Leak) అవ్వడంతో నలుగురు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని మధురవాడ వాంబే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉంటున్న బాలరాజు అయ్యప్పమాల ధరించాడు. గత శుక్రవారం గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో కొత్త సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చి తన పనుల్లో మునిగిపోయాడు. అయితే రెగ్యులేటర్ సరిగా అమర్చకపోవడం వల్ల గ్యాస్ లీక్ అయ్యింది.
గ్యాస్ లీక్ (Gas Leak) అవుతున్న విషయాన్ని బాలరాజు గుర్తించలేదు. కొంతసేపటి తర్వాత పూజా కార్యక్రమంలో భాగంగా దీపారాధన చేసేందుకు అగ్గి వెలిగించాడు. ఇంతలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. బాలరాజుతో పాటుగా భార్య చిన్ని, కుమారులు గిరి, కార్తీక్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు బాధితులను అంబులెన్స్ ద్వారా కింగ్ జార్జ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు కార్తీక్ రెండు రోజుల క్రితం చనిపోయాడు. బాలరాజు, భార్య చిన్ని, పెద్దకుమారుడు గిరి బుధవారం చికిత్స పొందుతూ మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం (4 died) వల్ల ఆ కాలనీలో విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్న పొరపాటు జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.