మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో నేడు సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్ లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా, మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా అదే బాటలో నడిచింది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ లో స్వైటెక్ 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో పరాజయం పాలైంది.
ఈ పోరు కేవలం గంటన్నరలో ముగిసింది. తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్ రెండో సెట్లో అయినా పుంజుకుంటుంది అనుకుంటే, పేలవ ఆటతీరు కనబర్చి మూల్యం చెల్లించుకుంది. రైబాకినా గతేడాది వింబుల్డన్ గెలిచి సత్తా చాటింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ అదే జోరు చూపిస్తోంది. రైబాకినా జెలెనా ఓస్టాపెంకో, కోకో గాఫ్ ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్స్ లో తలపడనుంది.