నల్లగా ఉందని తరచూ హేళన చేశాడని… ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. గొడ్డలితో భర్త తల నరికి మరీ హత్య చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గడ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్ వాని(40) నల్లగా ఉన్న తన భార్య సంగీతను తరచూ అవమానించేవాడు. అందరి ముందు ఆమెను హేళన చేసేవాడు. నల్లగా ఉందని, అసహ్యంగా ఉందని గేలి చేసేవాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా.. ఈ విషయంలో భార్యభర్తల మధ్య ఆదివారం గొడవ తారాస్థాయిలో జరిగింది.
భర్త తరచూ తనను అవమానించడం తట్టుకోలేకపోయిన ఆమె.. కోపంతో గొడ్డలితో భర్త పై దాడి చేసింది. ఈ దాడిలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడితో ఆగలేదు. భర్త చనిపోయిన తర్వాత అతని జననాంగాలు కూడా కోసేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే… పోలీసుల విచారణలో ఆమె తాను చేసిన నేరం అంగీకరించడం గమనార్హం. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.