Assam: ప్రస్తుతం అస్సాంలో వరదలు బీభత్సం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన కుంభవృష్టి వర్షాలకు అన్ని నదులు ప్రమాదకరస్థాయిలో కంటే ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల్లోని నీరు ప్రవేశిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజలు వరదలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 90 మంది చనిపోయారు. సుమారు 24 జిల్లాల్లోని 12.33 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ప్రస్తుతం వరద కాస్త తగ్గింది. అయిన 75 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 2406 గ్రామాల ప్రజలు ఇంకా ఇబ్బందిపడుతున్నారు.
32,924.32 హెక్టార్లలో సాగు భూములు ముంపునకు గురయ్యాయి. ఈ వరదలకు ధుబ్రి జిల్లాలో 18,326 మంది, కాచర్‌లో 1,48,609 మంది, గోలాఘాట్‌లో 95,277 మంది, నాగాన్‌లో 88,120 మంది, గోల్‌పరాలో 83125 మంది, మజులిలో 82,494 మంది, సౌత్ సల్యాజీలో 73,662 మంది, ధేమాజీలో 73,662 మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో 2.95 లక్షల మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. అలాగే కజిరంగా నేషనల్ పార్ట్ కూడా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా వందకు పైగా జంతువులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.