దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (డిసెంబర్ 8) స్వల్ప లాభాల్లో ప్రారంభమై, దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఫ్లాట్‌గానే కనిపిస్తోంది మార్కెట్. మొత్తానికి స్వల్ప లాభాల్లో ఉంది. మధ్యాహ్నం గం.11.40 సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్లు లాభపడి, 62,469 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు మాత్రమే లాభపడి 18,580 వద్ద ఉంది. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసింది. అయితే నాలుగు రోజుల నష్టాల నుండి మార్కెట్ నేడు కాస్త కోలుకున్నట్లుగా కనిపిస్తోంది.
నేటి ప్రారంభ ట్రేడింగ్‌లో పలు స్టాక్స్ పది శాతం కంటే అధికంగా లాభాల్లో ప్రారంభమయ్యాయి. సులభ్ ఇంజనీర్స్ 14 శాతం, టాల్ బ్రోస్ ఆటో 14 శాతం, మాధవ్ ఇన్ఫ్రా 14 శాతం, వెంకీ 14 శాతం, విక్టోరియా మిల్స్ 13.7 శాతం, కాంపీటెంట్ ఆటో 13.5 శాతం, జెహెచ్ఎస్ స్వీడ్గార్డ్ 11.5 శాతం, సిల్వర్ ఓక్ 11.25 శాతం, సనత్ నగర్ ఎంటర్ ప్రైజ్ 10 శాతం, ఆర్క్ ఫైనాన్స్ 10 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ 50 స్టాక్స్‌లో సగానికి పైగా లాభాల్లో ఉన్నాయి. విక్టోరియా మిల్స్, క్లారా ఇండస్ట్రీస్, నర్మదా జిలెటైన్, బీ రైట్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్, ఆర్ ఆర్ ఫైనాన్షియల్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.
ఇదిలా ఉండగా, ఆర్బీఐ వివిధ మార్కెట్ ట్రేడింగ్ గంటలను పొడిగించాయి. కొత్త టైమింగ్స్ ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇది డిసెంబర్ 12వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం కాల్/నోటీస్/టర్మ్ మనీ మార్కెట్, మార్కెట్ ఫర్ కమర్షియల్ పేపర్స్ అండ్ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్, రెపో ఇన్ కార్పోరేట్ బాండ్స్, రుపీ ఇంటరెస్ట్ రేటు డెరివేటివ్స్ సాయంత్రం 5 గంటలకు ముగియనున్నాయి.